ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌ తీరును ఎండగట్టిన భారత్

వాస్తవం ప్రతినిధి : మరోసారి పాకిస్థాన్ పాతపాటే పాడుతూ.. జమ్మూకశ్మీర్ అంశం అంతర్జాతీయ అంశమంటూ యూఎన్‌హెచ్ఆర్‌సీలో లేవనెత్తింది. జమ్మూకశ్మీర్‌ అంశం భారత అంతర్గత వ్యవహారం కాదంటూ పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమూద్ ఖురేషి ప్రసంగించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ విజయ్ ఠాకూర్ సింగ్ తోసిపుచ్చారు. భారత ప్రభుత్వం తీసుకున్న సార్వభౌమాధికార నిర్ణయాలు పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహారమని విజయ్ ఠాకూర్ సింగ్ కుండబద్ధలు కొట్టారు. పార్లమెంటులో ఆమోదించిన ఇతర నిర్ణయాల తరహాలోనే కశ్మీర్ విషయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని, వాటిలో ప్రపంచంలోని ఏ దేశం ప్రమేయాన్ని కూడా అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.

కశ్మీర్‌లో ప్రగతిశీల విధానాలను పూర్తిగా అమలు చేయనున్నామని ఠాకూర్ సింగ్ తెలిపారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ పాక్ పూర్తిగా తప్పుడు కథనాలు, కట్టుకథలు ప్రచారం చేస్తోందన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఎవరు కేంద్ర స్థానంగా నిలుస్తున్నారో, ఉగ్రవాదులకు ఆశ్రయం, నిధులు అందించడం చేస్తున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసునని పరోక్షంగా పాక్‌ తీరును ఎండగట్టారు.