కెప్టెన్ కోహ్లీ- వైస్ కెప్టెన్ రోహిత్ మధ్య విభేదాల అంశంపై స్పందించిన రవిశాస్త్రి

వాస్తవం ప్రతినిధి : విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాల అంశంపై టీమ్‌ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఎట్టకేలకు స్పందించాడు. ఆటగాళ్ల మధ్య భిన్నాభిప్రాయాలను గొడవల్లా చూడకూడదని చెప్పాడు. ఓ వార్తాసంస్థతో శాస్త్రి మంగళవారం మాట్లాడాడు. కెప్టెన్ కోహ్లీ- వైస్ కెప్టెన్ రోహిత్ మధ్య విభేదాలున్నాయన్న ఊహాగానాలను కొట్టిపారేశాడు.

15 మంది ఆటగాళ్లు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొందరి అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ఇది సాధారణం. జట్టుకు కావాల్సింది కూడా అదే. అందరూ ఒకేలా ఆలోచించాలని అనుకోను. ఓ అంశంపై ముందే చర్చించి ఉంటాం. ఆ తర్వాత ఒకరికి కొత్త ఆలోచన తడుతుంది. దాన్ని కూడా ప్రోత్సహించాలి. అందుకే అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏది అత్యుత్తమమైనదో నిర్ణయించాలి. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడైనా మేం ఆలోచించని ఓ వ్యూహంతో ముందుకువస్తే దానిపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. భిన్నాభిప్రాయాలను గొడవల్లా చూడకూడదు అని రవిశాస్త్రి చెప్పాడు.