పల్నాడు పోరు!

అలనాడు ఆధిపత్యంకోసం పల్నాటి యుద్దం జరిగితే …ఈ నాడు రాజకీయం కోసం పల్నాటి పోరు సాగుతోంది.. రాష్ట్రంలో అధికార ,ప్రతిపక్ష పార్టీలు పల్నాడు ను మూల బిందువుగా చేసుకుని ప్రత్యక్ష పొలిటికల్ ఫైట్ కు దిగాయి.. చలో ఆత్మకూరు అంటూ కయ్యానికి కాలుదువ్వింది ప్రతిపక్షం …. సై అంటే సై అని సైరన్ మోగించింది అధికార ప్రభుత్వం .. మారు మోగుతున్న చలో ఆత్మకూరు అసలు కథ పై స్పెషల్ రిపోర్టు.

12 వ శతాబ్దం లో నాటి సాంఘిక , కుల , అంటరానితనం ఆచారాలకు స్వస్తి పలకడానికి వీరోచితం గా సాగిన యుద్దమే పల్నాటి యుద్దం. ప్రపంచంలోనే పేరుగాంచిన పల్నాటి యుద్దానికి ఆంధ్ర కురు క్షేత్రంగా నానుడి. గుంటూరు జిల్లా కారంపూడి కేంద్రం గా సాగిన పల్నాడు పోరు లో ప్రధానంగా వినిపించే పేర్లు బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ.. వైష్ణవులు, శైవుల మద్య సాగిన వర్గ పోరుగా పల్నాటి యుద్దాన్ని పేర్కొంటారు. కుల మతాలకు అతీతంగా అంటరాని తనాన్ని రూపు మాపే చాపకూటి సిధ్దాంతాన్ని చాటి చెప్పింది పలనాటి బ్రహ్మనాయుడే.. నాటి నుండి వీరత్వానికి పల్నాడు ప్రాంతం పర్యాయపదమైంది. , కక్షలు ,కార్పణ్యాలకు , పగ , ప్రతీకారాలకు కేరాప్ పల్నాడు అనే పేరు ఇంకా కొనసాగుతూనే ఉంది.

పురాతనమైన పల్నాటి చరిత్ర ను పక్కన పెడితే నేడు మనం 21 వ శతాబ్దంలో ఉన్నాం . అయినా నేటికి పల్నాడు ప్రాంతంలో ఇంకా దాయాదుల పోరు, కుల, వర్గ, రాజకీయ వైరం తారా స్థాయికి చేరి నిత్యం ఏదొక చోట ధన మాన ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. ప్రజా స్వామ్యం అని గర్వంగా చెప్పుకుంటూనే ఏ పార్టీ అధికారంలో ఉంటే వారిదే సామ్రాజ్యం అన్నట్లు ఏలుబడి సాగుతుంది. సగం కాలం పగలు , సగం కాలం రాత్రి ఎలాగో, కొన్నాళ్లు అధికారం , మరి కొన్నాళ్లు ప్రతిపక్షం మాదిరిగా వారి ఆయా గ్రామాల్లో ప్రాంతాల్లో ఆధిపత్యం సాగించడం పరిపాటైంది. అనుకూల టైమ్ లో పెత్తనం చేయడం, లేని సమయంలో సైలెంట్ గా వలస వెళ్లడమో మౌనం వహించడం కామన్ గా మారింది.

పదేళ్ల క్రితం స్థాపించిన వైసిపి కి 2019 లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు అధికారం కట్టబెట్టారు. జగన్ మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడు నెలలు దాటింది.. అధికారం వచ్చిందన్న వైసిపి శ్రేణుల్లో ఆనందానికి అవధుల్లేవు. పల్నాడు లోని కొన్ని ప్రాంతాల్లో టిడిపి హాయంలో ఇబ్బందులు పడ్డ వైసిపి సైన్యం పగ , ప్రతీకారం తీర్చుకునేందుకు పూనుకున్నారు. ఎన్నో దాడులు , హత్యలు , హత్యాయత్నాలు, గ్రామ బహిష్కరణలు, వేధింపులు జరిగాయి.. దీంతో పచ్చ పార్టీ వారు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొంత మంది ఎదురొడ్డి వీరత్వం చాటుకుంటుండగా మరి కొందరు గ్రామాలు వదిలివెళ్లకతప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు చేసేది లేక తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు ఏకరువు పెట్టుకున్నారు.

తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు బాధితులు కు అండగా నిలుస్తామంటూ చంద్రబాబు నాయుడు గుంటూరు కేంద్రంగా పునరావాస శిభిరాలు ఏర్పాటు చేసారు. బాధితుల గోడు ను ఆలకించారు. అధికారపార్టీ ఆగడాల పై నిప్పులు చెరిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. అయినా న్యాయం జరగడంలేదని గ్రామాలు వదలి వచ్చిన బాధితులందరినీ వారి గ్రామాలకు తీసుకెళ్లి ధైర్యం నింపాలన్న ఆకాంక్షతో చలో ఆత్మకూరు కు పిలుపిచ్చింది. టిడిపి నేతలు ఇచ్చిన చలో ఆత్మకూరు ను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి పల్నాడు లో ఆంక్షలు పెట్టింది. చంద్రబాబు , లోకేష్ తోపాటు ప్రముఖ టిడిపి నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులుచేసారు. అక్రమ అరెస్టులు చేయడం పై పసుపు దళం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రతిపక్షపార్టీ చేస్తుంది డొంక తిరుగుడు రాజకీయాలని గడచిన ఐదేళ్లు తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు , అరాచకాలు సాగించారని ఖండిస్తున్నారు వైసిపి నేతలు.. . పల్నాటి పులులుగా పేరు పొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ ప్రజా ప్రతినిధులు కోడెల శివప్రసాద్ , యరపతినేని శ్రీనివాసరావు ల అండ దండలతో ఎన్నో అక్రమాలు దమనకాండలు , దోపిడిలు సాగాయనేది నేటి అధికార వైసిపి ప్రజా ప్రతినిధులు మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. వాస్తవాలు ఏమిటో తాము కూడా ప్రజలకు చాటి చెపుతామంటూ పోటా పోటీగా సై అంటే సై అంటూ వైసిపి కూడా చలో ఆత్మకూరుకు పిలుపిచ్చింది. రాజకీయ మనుగుడ కోసం వాస్తవాలను వక్రీకరించి ప్రభుత్వం పై బురద జల్లే యత్నం చేస్తున్నారని వాస్తవానికి పల్నాడు లో ప్రశాంత వాతావరణం ఉందని ఎలాంటి శాంతి భద్రత సమస్యలు లేవంటున్నారు.

రెండు పోతెద్దుల పోరు మద్య లేగదూడు నలిగినట్లు అధికార, ప్రతిపక్ష వ్యూహాల మద్య అధికారులు నలిగిపోతున్నారు. రెండుపార్టీలకు అనుమతులు లేవంటూ హై ఎలర్ట్ పేరుతో అరెస్టుల పర్వం సాగించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది చలో ఆత్మకూరు . గుంటూరు జిల్లా దుర్గిమండలం ఆత్మకూరు లో అసలు ఏమి జరిగింది? అన్న విషయానికొస్తే..

ఆత్మకూరు లో బిసి కులాల్లో ఒకటైన పెరిక సామాజిక వర్గం నివాసాలు ఎక్కువ.. ఒకే సామాజికవర్గం కు చెందిన వారిలో 2016 లో కుటుంబ కలహాలు రావడంతోర రెండు వర్గాలు గా చీలిపోయారు. వీరంతా టిడిపి పార్టీ కి చెందిన వారు . గత మూడేళ్లుగా పదే పదే ఇరువర్గాలు ఒకరి పై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఒక వర్గానికి టిడిపి గా అండగా నిలవడంతో మరో వర్గం వారు గ్రామాన్ని వదిలి తల దాచుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో వారు వైసిపి తీర్ధవం పుచ్చుకున్నారు.. వైసిపి అధికారం లోకి రాగానే తిరిగి వారి గ్రామానికి తరలివచ్చారు. దీంతో టిడిపి సానుభూతి వర్గం వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారేమో అనే భయంతో సుమారు 50 కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇదీ ఆత్మకూరు అసలు కథ.

ఒకే సామాజికవర్గం, ఒకే పార్టీకి చెందిన వారి మద్య ఏర్పడ్డ కలహాలను రెండు పార్టీలకు పులిమారు. రాజకీయాల కోసం పల్నాడు కేంద్రం గా అధికార , ప్రతిపక్ష పార్టీలు నాటి పల్నాటి యుద్దాన్ని తలపించేలా పాకులాడుతున్నాయి. ఈ చంద్రన్న, జగన్నాటకాలను చూసి జనం ఆసక్తిగా తిలకిస్తూ చర్చించుకుంటున్నారు.

                                                                 ……………ముక్కంటి కంబాల