పల్నాడు ప్రాంతంలో 144, 30 సెక్షన్లు విధించాం : ఏపీ డీజీపీ

వాస్తవం ప్రతినిధి : శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పల్నాడులో అన్ని చర్యలు తీసుకుంటామని.. ప్రస్తుతం 144, 30 సెక్షన్లు విధించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అక్కడ ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనకు అనుమతిని ఇవ్వబోమని గౌతమ్ చెప్పుకొచ్చారు. శాంతి భద్రతల విషయంలో అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. వినాయక నిమజ్జనం, మొహరం పండుగల నేపథ్యంలో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పల్నాడులో ఎలాంటి అవాంచనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ తెలిపారు.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా పల్నాడులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ శ్రేణులపై దాడులు చేస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరి ఒకరు పోటీగా బాధితుల కోసం పల్నాడులో పునరావాస శిబిరాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.