చంద్రబాబు పై అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు

వాస్తవం ప్రతినిధి: ఏ గ్రామంలో అయితే శాంతి భద్రతలకు భంగం వాటిల్లిందో అక్కడికి తాను వెళతానని, అక్కడే ఉంటానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, శాంతి భద్రతలకు ఏ గ్రామాల్లో విఘాతం కలిగిందో అక్కడికి చంద్రబాబు రావాలని అన్నారు. పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నాయని అదేపనిగా చంద్రబాబు చెబుతున్నారని, మరి, ఆయన పక్కనే ఉండే రెండు పల్నాడు పులులు కోడెల శివప్రసాద్, యరపతినేని శ్రీనివాస్ కనపడరే అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘ఆ పులులు ఏమైపోయాయి? కనపడవే? నీ (చంద్రబాబు) పక్కన కనపడట్లేదు. ఏమైపోయాయో నాకు అర్థం కావట్లేదు. కేసులకు తట్టుకోలేక దాక్కున్నారు’ అని విమర్శించారు. కోడెల ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో వాళ్ల డబ్బులు వాళ్లకు ఇచ్చేలా చంద్రబాబు చూడాలని సూచించారు. గుండెజబ్బుతో కోడెల ఆసుపత్రిలో చేరితే ఆయన్ని కనీసం పలకరించేందుకు కూడా చంద్రబాబు వెళ్లలేదని విమర్శించారు.