మచిలీపట్నం పోర్టుపైనా కోర్టుకెళ్లిన నవయుగ కంపెనీ

వాస్తవం ప్రతినిధి: కాంట్రాక్టుల రద్దుపై ఏపీ సర్కార్ తో… తాడో పేడోతేల్చుకోవాలని నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ రెడీ అయినట్లుగా… తెలుస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ టెండర్లపై.. హైకోర్టుకు ఎక్కి మధ్యంతర విజయం సాధించిన నవయుగ కంపెనీ తాజాగా మచిలీపట్నం పోర్టు విషయంలోనూ… ప్రభుత్వం తీసుకున్న రద్దు నిర్ణయాన్ని కొట్టి వేయాలంటూ.. హైకోర్టులో పిటిషన్ వేసింది.

నవయుగ హైకోర్టులో పిటిషన్ వేస్తున్న సమయంలోనే… మంత్రివర్గ సమావేశంలో.. బందరు పోర్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ… ఆ సంస్థకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటూ.. మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నవయుగ సంస్థ.. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. నవయుగ మాత్రం ప్రభుత్వమే.. ఒప్పందం మేరకు అవసరమైన భూములను తమకు అప్పగించడంలో విఫలమైందని పిటిషన్‌లో పేర్కొంది. పోర్టు నిర్మాణ పనులకు అవసరమైన రవాణా, విద్యుత్‌ తదితర సదుపాయాలను కూడా సమకూర్చలేదని, అందువల్ల ప్రభుత్వమే ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినట్లయిందన్నారు. పోర్టు ప్రాజెక్టుకు సంబంధించిన పలు పనుల కోసం ఇప్పటికే రూ.436కోట్లు వ్యయం చేశామని నవయుగ కోర్టుకు తెలిపింది.