సిలికానాంధ్ర మనబడి 7వ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీల విజేతలు వీరే!

వాస్తవం ప్రతినిధి:  డెట్రాయిట్ – ఆగస్టు 24-25: “పలుకే బంగారం – పదమే సింగారం” అన్న నినాదంతో సిలికానాంధ్ర మనబడి ఈ వారాంతం డెట్రాయిట్ లో ఏడవ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలను దిగ్విజయంగా నిర్వహించింది.

అమెరికా లో 800 మంది కి పైగా ప్రాంతీయ పోటీలలో తలపడి, అందులో నెగ్గిన 52 మంది మెరికలు ఈ తుది పోటీలలో (ఫైనల్స్) పాల్గొన్నారు.

“తిరకాటం” అన్న తెలుగు ప్రశ్నలు జవాబుల క్విజ్ పోటీలో విద్యార్థులు తెలుగు సాహిత్యం, కళలు, జాతీయాలు, సామెతలు , తెలుగు వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు లాంటి అనేక విభాగాల్లో ప్రశ్నలకి అవలీలగా జవాబులు చెప్పి తమ విజ్ఞానాన్ని ప్రదర్శిం చారు. “పదరంగం” అనే తెలుగు పదాలను విని రాసే పోటీలో “కులిశకర్కశదేహులు”, “ప్రాక్స్రోతస్సు”, “తార్క్ష్యము” లాంటి క్లిష్టమైన పదాలను విద్యార్థులు ఏ మాత్రం తడబాటు లేకుండా రాసేసి ప్రేక్షకులని ఆశ్చర్య పరిచారు.

ఎంతోమంది కార్యకర్తల సహకారం తో, ఈ ఆటలు జరిగాయి. సిలికానాంధ్ర మనబడిలో 12 సంవత్సరాలలో 52000 మందికి పైగా విద్యార్ధులు తెలుగు  నేర్చుకుంటున్నారనీ, 2019-20 మనబడి తరగతులు సెప్టెంబర్ 7 నుంచి అమెరికా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాల్లో ప్రారంభమవుతాయని, ఆగస్టు 31లోపు నమోదు చేసుకోవాలని, manabadi.siliconandhra.org వెబ్‌సైట్‌ లో లేదా 1-844-626-(BADI) 2234 నంబర్‌ను సంప్రదించవచ్చని, మనబడి ఉపాధ్యక్షులు: శ్రీ తోటపల్లి ధనుంజయ్ సందేశం అందించారు.

తెలుగు మాట్లాట పోటీలలో పాల్గొనడానికి తెలుగు పిల్లలందరూ అర్హులే. మీ ప్రాంతంలో జరపదల్చుకుంటే maatlaata@manabadi.siliconandhra.org కు ఈమెయిలు, లేక +1-248-470-7163 నంబర్ కి వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చని మిషిగన్ సమన్వయకర్త: శ్రీ పలిగారం దుశ్యంత నాయుడు, తెలుగు మాట్లాట సంచాలకులు శ్రీ తొంటా శ్రీనివాస్ తెలిపారు. 

సిలికానాంధ్ర మనబడి 7వ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీల విజేతలు:

బుడతలు (5-9 ఏళ్ల పిల్లలు):

పదరంగం: 1. పారుపూడి సాన్వి 2. ఆలిబిల్లి అవనీష్

తిరకాటం: 1. బోదనపు వేదశ్రీ 2. మాల్యవంతం అనిక

సిసింద్రీలు (10-14 ఏళ్ల పిల్లలు):

పదరంగం: 1. జవ్వాది ఆయుష్ 2. కొణతాలపల్లి తరుణి

తిరకాటం: 1. దోసిభట్ల రామ్ 2. నెరయనూరి లాస్య