అమరావతి లో నడుస్తుంటే ఓ శ్మశానంలో నడిచినట్లు ఉంది: కోడెల

వాస్తవం ప్రతినిధి: అమరావతి ప్రాంతానికి వెళితే ఓ శ్మశానంలో నడిచినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఇది ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంలో జగన్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. కేంద్రం వద్దంటున్నా, ప్రైవేటు పెట్టుబడిదారులు వద్దని చెబుతున్నా ఈ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అన్నది తెలుగు ప్రజల ఆకాంక్ష అనీ, కల అని తెలిపారు. దాన్ని నిర్వీర్యం చేయవద్దని కోరారు. ఎప్పుడూ పండుగ సందర్భంలాగా కళకళలాడే ప్రాంతంలాగా ఉన్న అమరావతి ఇప్పుడు శ్మశానంలాగా మారిపోయిందని చెప్పారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలతో పాటు పెట్టుబడులు, బ్యాంకుల రుణాలు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. రాజధాని తరలింపు, విద్యుత్ పీపీఏ ఒప్పందాల సమీక్ష, పోలవరం పనుల నిలుపుదల, రివర్స్ టెండరింగ్ వంటి పనులు చేయానికి 5 కోట్ల మంది ఏపీ ప్రజలు జగన్ కు అధికారం ఇవ్వలేదని గుర్తుచేశారు. నమ్మి ఓటేసిన ప్రజలకు నిర్మాణాత్మకమైన పరిపాలన అందించాలని సూచించారు.