ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి చేరుకొన్న హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌

వాస్తవం ప్రతినిధి: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ సంచలన విజయం నమోదు చేసాడు. రెండు సార్లు ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ లిన్‌ డాన్‌ (చైనా)ను ఓడించి ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రణయ్‌ 21-11, 13-21, 21-7తో 11వ సీడ్‌ లిన్‌ డాన్‌ (చైనా)పై విజయం సాధించాడు. 62 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ప్రణయ్‌ గొప్పగా ఆడాడు. తొలి గేమ్‌ నుంచే దూకుడుగా ఆడుతూ 10-5, 19-11తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను గెలిచాడు. అయితే రెండో గేమ్‌లో తడబడ్డ ప్రణయ్‌.. నిర్ణాయక మూడో గేమ్‌లో సత్తా చాటాడు. 6-5తో ఉన్నదశలో ప్రణయ్‌ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 14-5తో ముందంజ వేశాడు. ఆ తర్వాత లిన్‌ డాన్‌కు రెండు పాయింట్లు కోల్పోయిన ప్రణయ్‌.. మరో ఏడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. తన కెరీర్‌లో లిన్‌ డాన్‌ను మూడోసారి ఓడించిన ప్రణయ్‌.. అతనిపై 3-2తో మెరుగైన రికార్డును నమోదు చేశాడు.