మధ్యప్రదేశ్ లోని ఎనిమిది జిల్లాల్లో హైఅలర్ట్!

వాస్తవం ప్రతినిధి: మధ్యప్రదేశ్ లోని ఎనిమిది జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన టెర్రరిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో… గుజరాత్, రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ జిల్లాలను అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, ముష్కరుల కోసం పోలీసులు వేటను ప్రారంభించారు. గుజరాత్, రాజస్థాన్ లలోకి నలుగురు ఆఫ్ఘన్ టెర్రరిస్టులు చొరబడ్డారంటూ తొలుత సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నలుగురే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో అడుగుపెట్టారని భావిస్తున్నారు.

ఈ నలుగురు టెర్రరిస్టుల్లో ఒకరి స్కెచ్ ను అన్ని పోలీస్ స్టేషన్లు, ఔట్ పోస్టులు, చెక్ పాయింట్స్ కు పంపించామని జబువా జిల్లా ఎస్పీ వినీత్ జైన్ తెలిపారు. సదరు ఉగ్రవాది ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్ లోని కునార్ ప్రావిన్స్ కు చెందినవాడని చెప్పారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను పెంచామని తెలిపారు. అయితే, ఈ టెర్రరిస్టులు భారత భూభాగంలోకి ఎలా అడుగు పెట్టారనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

మరోవైపు, రాజస్థాన్, గుజరాత్ ల నుంచి వస్తున్న అన్ని రైళ్లను కూడా సోదా చేస్తున్నారు. ముఖ్యంగా న్యూఢిల్లీ-ముంబై రూట్ లో ఉన్న రాట్లం రైల్వే స్టేషన్ పై ఎక్కువ దృష్టి సారించారు.