చంద్రుడి కక్ష్యలోకి చేరుకొన్న చంద్రయాన్ 2

వాస్తవం ప్రతినిధి: ఇస్రో అనుకున్న ప్రకారమే చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 2 ఉపగ్రహం అడుగు పెట్టింది. ఇప్పటివరకూ ఉప గ్రహంలోని అన్ని వ్యవస్థలు సరిగా పని చేస్తున్నట్లుగా ఇస్రో ప్రకటించింది. ఈ మొత్తం ప్రయోగంలో అత్యంత కష్టమైన.. క్లిష్టమైన ప్రక్రియ చంద్రుడి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టటంగా చెప్పారు. ఆ కార్యక్రమాన్ని నేడు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. తాజాగా చంద్రయాన్ 2 వేగాన్ని తగ్గించి దాని దశ.. దిశను మార్చారు. దీంతో ఉపగ్రహం చంద్రుడి 114కి.మీ x 18072 కి.మీ కక్ష్యలోకి చొచ్చుకెళ్లింది. వ్యోమనౌకలోని ద్రవ ఇంజిన్ ను మండించటం ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. ఇప్పటి నుంచి మరో నాలుగు విన్యాసాలు చేయటం ద్వారా చంద్రుడికి చేరువుగా ఉండే చివరి కక్ష్యలోకి చేరుకుంది.

ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం సెప్టెంబరు 7 తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 2.30 గంటల మధ్యలో చంద్రయాన్ 2 చంద్రుడి మీద ల్యాండింగ్ కానుంది. ఆ వెంటనే ఆర్బిటర్.. ల్యాండర్ లో ఏర్పాటు చేసిన కెమేరాలు ల్యాండింగ్ ప్రాంతాన్ని.. రియల్ టైమ్ ఫోటోల్ని తీసి కిందకు పంపనున్నాయి.