మరోసారి తన ధాతృత్వాన్ని చాటుకున్న పవన్ కల్యాణ్..!

వాస్తవం ప్రతినిధి: జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా విభిన్నమైనది. మానవత్వాన్ని చూపడంలో ఆయనకు మించి అటు రాజకీయ రంగంలో ఇటు సినిమా రంగంలోనూ ఎవరు ఉండరు అని చాలామంది అంటారు. ఇప్పటికే చాలామందికి సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా క్యాన్సర్ వ్యాధితో బాధప‌డుతున్న త‌న అభిమాని, జనసైనికుడు శ్రీపాత‌కూటి బుడిగ‌య్య‌ను జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాన్ పరామ‌ర్శించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిపై కుటుంబ స‌భ్యుల‌ను ఆరా తీశారు. వైద్య ఖ‌ర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్ధికస‌హాయం అందించారు. త‌న అభిమాని త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భ‌గ‌వ‌తుండిని ప్రార్ధిస్తూ వినాయ‌కుడి విగ్ర‌హాన్ని బ‌హూక‌రించారు. దేవుడు బుడిగ‌య్య‌కు మంచి చేయాల‌ని ఆకాంక్షించారు. ప్ర‌కాశం జిల్లా త్రిపురాంతకం మండ‌లం, అన్న‌స‌ముద్రం గ్రామానికి చెందిన బుడిగ‌య్య శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కు వీరాభిమాని. గ‌త కొంత‌కాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. కీమో థెర‌పీ తీసుకుంటూ కూడా జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాధి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో కొంత‌కాలంగా మంచానికే ప‌రిమితం అయ్యారు. శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ను చూడాల‌న్న త‌న కోరిక‌ను స్థానిక జ‌న‌సేన నాయ‌కుల‌కు తెలియ‌ప‌ర‌చ‌గా, విష‌యం పార్టీ అధినేత దృష్టికి తీసుకు వచ్చారు. బుడిగయ్యను పరామర్శించేందుకు అన్నసముద్రం వస్తానని చెప్పారు. ఈలోగా అత‌న్ని అంబులెన్స్ లో ప్ర‌శాస‌న్‌న‌గ‌ర్‌లో జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి తీసుకువ‌చ్చారు. వ్యాధి ఎంత కాలం నుంచి ఉంది? చికిత్స ఎక్క‌డ చేయిస్తున్నారు అన్న విష‌యాల‌ను అత‌ని భార్య‌ను అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో ఎన్‌.ఆర్‌.ఐ ఆసుప‌త్రి వైద్యుల‌తో తాను స్వ‌యంగా మాట్లాడుతాన‌ని శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తెలిపారు. బుడిగయ్య ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు చూడాలని ఎర్రగొండపాలెం నుంచి జనసేన అభ్యర్థిగా నిలిచిన డా.గౌతమ్ కు సూచించారు.