ప్రభుత్వం, ప్రవాసాంధ్రులు కలిసి గ్రామాలను బాగు చేసుకుందాం రండి: జగన్

వాస్తవం ప్రతినిధి: ప్రవాసాంధ్రులు ఏడాదికి ఒక్కసారైనా రాష్ట్రానికి రావాలని ఏపీ సీ ఎం జగన్ అన్నారు. ప్రభుత్వం, ప్రవాసాంధ్రులు కలిసి గ్రామాలను బాగు చేసుకుందామని జగన్ పిలుపుఇచ్చారు. అవినీతిలేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలనేది తన కల అని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం జగన్‌ డల్లాస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌లో ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రవాసాంధ్రులు మాపై చూపిస్తున్న ప్రేమకు సెల్యూట్‌ అని పేర్కొన్నారు. వారి దేశాభివృద్ధిలో భారతీయులు కృషి ఎంతో ఉందని అమెరికా అధ్యక్షుడు అన్నారన్నారు. అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా తెలుగువారిని పొగడటం ఎంతో గర్వంగా ఉందన్నారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ ప్రసంగాన్ని జగన్‌ చదివి వినిపించారు. ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌ అన్న మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ స్ఫూర్తిదాయకమన్నారు.

అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రాన్ని చూడాలని తన కల అన్నారు. అన్నం పెడుతున్న రైతు ఆకలి బాధతో మరణించకూడదన్నది తన కల అన్నారు. ప్రభుత్వ పథకాలు లంచం, విచక్షణ లేకుండా పేదవాడికి చేరాలన్నది తన కల అన్నారు. పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏదీ లేదన్నారు. రెండున్నర నెలల పరిపాలనలోనే చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో 19 బిల్లులను తీసుకొచ్చామన్నారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల పూర్తికి నాంది పలికామన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టం చేశామన్నారు. కరెంటు కొనుగోళ్ల అగ్రిమెంట్లను మార్చడానికి సన్నాహాలు చేశామన్నారు. అమ్మ ఒడి, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మద్యం బెల్టు దుకాణాల మూసివేత చేపట్టామన్నారు. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వివక్షలేని పరిపాలన అందించాలనేది తన కోరిక అన్నారు.