చరిత్రను తిరగరాసే విధంగా ఏపీలో పరిపాలన జరుగుతుంది అంటున్న జగన్..!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల ఏపీ సీఎం జగన్ కుటుంబసమేతంగా అమెరికా పర్యటన చేపట్టిన విషయం అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా అక్కడ ఉన్న బడా వ్యాపారవేత్తలు తో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను తెలియజేసిన జగన్..డల్లాస్ లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆంద్రప్రదేశ్ లో చరిత్ర ను మార్చే దిశగా పాలనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. డల్లాస్ లో జరిగిన ఎన్.ఆర్.ఐ.ల సభలో ఆయన మాట్లాడారు.ఈ రెండునర్న నెలల పాలనలోనే చరిత్రను మార్చే అనేక నిర్ణయాలు చేశామని ఆయన చెప్పారు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి కార్యక్రమాలు చేపట్టాం. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మద్యం బెల్టు దుకాణాల మూసివేత చేపట్టాం. మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం రిజర్వేషన్‌ కల్పించాం. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేశాం అని జగన్ వివరించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిలేని టెండర్లకు రూపకల్పన చేశామని జగన్ తెలిపారు. ఇంకా అనేక విషయాలు తెలియజేస్తూ రాష్ట్రంలో అవినీతి లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈ సభలో పేర్కొన్నారు జగన్.