టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా మరోసారి ఎంపికైన రవిశాస్త్రి

వాస్తవం ప్రతినిధి: టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి మరోసారి ఎంపికయ్యాడు. కోచ్ పదవి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన.. కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహాదారుల కమిటీ చివరికి రవిశాస్త్రి వైపే మొగ్గుచూపింది. 2021 ఐసీసీ వరల్డ్ టీ20 వరకు.. రెండేండ్ల పాటు అతడు పదవిలో కొనసాగనున్నాడు. బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూకు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫిల్ సిమ్మన్స్ వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదు. మిగిలిన ఐదుగురి ప్రణాళికలను క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ.. చివరకు రవిశాస్త్రికే పట్టం కట్టింది… అనుభవం, గతంలో సాధించిన ఘనతలు, కోచింగ్ నైపుణ్యం, భావ వ్యక్తీకరణ, ఆధునిక సాధనాల పరిజ్ఞానం అనే ఐదు అంశాల ఆధారంగా ఎంపిక ప్రక్రియను చేపట్టారు. ప్రతి అంశానికి నాలుగు గ్రేడ్‌ మార్కులు కేటాయిస్తూ.. చివరకు వాటన్నింటిని కలిపి అగ్రస్థానంలో నిలిచిన రవిశాస్త్రిని ఎంపిక చేశారు.