హాంకాంగ్‌ ఎయిర్‌పోర్టును ముట్టడించిన వేలాదిమంది నిరసనకారులు

వాస్తవం ప్రతినిధి: హాంకాంగ్‌ నిరసనలతో హోరెత్తుతోంది. పోలీసులకు వ్యతిరేకంగా గళం విప్పిన కొన్ని వేలమంది నిరసనకారులు విమానాశ్రయాన్ని ముట్టడించారు. నల్లటి దుస్తులు ధరించి ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా నలుపు రంగును పులముకున్నట్లు అయింది. నేరస్తులను చైనాకు అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్‌లో ఆందోళనలు పీక్‌ స్టేజ్‌కు చేరాయి. హాంకాంగ్‌ ఎయిర్‌పోర్టును ముట్టడించారు. లోపలికి చొరబడి చైనా పౌరులతో పాటు పోలీసులపైనా దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విమాన సర్వీసులను రద్దు చేశారు అధికారులు. ఈ ఘటనను ఖండించిన చైనా.. ఉగ్రవాద తరహా దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హాంకాంగ్‌ సరిహద్దులకు తన సైనిక దళాలను తరలించింది.

ప్రభుత్వ హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా నిరసనకారులు బీభత్సం సృష్టించారు. దీంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు పెప్పర్​ స్ప్రే ఉపయోగించారు. అయినా బెదరకుండా పోలీసులపైనా దాడికి దిగడంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రొ డెమోక్రసీ నేతల జోక్యంతో ఆందోళనకారులను రిలీజ్‌ చేశారు. ఎయిర్‌పోర్టులో నిరసనలపై స్పందించిన అధికారులు..ఇలా చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి చర్యల వల్ల హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్నారు.