చంద్రబాబు ఇంటి దగ్గర టీడీపీ, వైసీపీ వర్గాలు బాహాబాహీ !

వాస్తవం ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన ఇంటిపై డ్రోన్లను ఉపయోగించిన ఘటనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈసందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. టీడీపీ నేత దేవినేని అవినాష్ సమక్షంలో ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం పిడిగుద్దులు కురిపించాయి.

మరోవైపు ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద డ్రోన్లు ఎగురవేయడానికి తామే అనుమతి ఇచ్చామని ఇరిగేషన్‌ శాఖ ప్రకటించింది. వరద పరిస్థితిపై అంచనా వేయడానికి డోన్ల ద్వారా వీడియోలను తీసుకున్నామని ఇరిగేషన్‌ శాఖ పేర్కొంది. తన నివాసం వద్ద డ్రోన్లు ఎగరడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.