జంతువుల కంటే హీనంగా బంధించారు: మెహబూబా ముఫ్తీ కుమార్తె

వాస్తవం ప్రతినిధి: జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలువురు ప్రతిపక్ష నేతల గృహ నిర్బంధం కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, ఇతర నాయకులు ఇప్పటికీ గృహ నిర్బంధంలోనే ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం వారిని విముక్తులను చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందినప్పటికీ.. దీనికి భిన్నమైన పరిస్థితులు కాశ్మీర్ లోయలో నెలకొని ఉన్నాయి.

తాజాగా జమ్ము కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా జావేద్‌ తమను జంతువుల కంటే హీనంగా బంధించారని ఆరోపిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశారు. తాను మీడియాతో మాట్లాడితే భయంకర పరిణామాలు ఎదురవుతాయని బెదిరింపులు వస్తున్నాయని ఆమె అన్నారు. కాశ్మీరీలను జంతువుల్లా బంధించారని, మావన హక్కులను అణచివేశారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న వేళ కాశ్మీరీలు జంతువుల్లా బందీలై ఉన్నారని ఆమె ఆరోపించారు. తనను అక్రమంగా ఎందుకు నిర్బంధించారని ప్రశ్నిస్తే మీడియాతో మాట్లాడుతున్నందున నిర్బంధించామని భద్రతా సిబ్బంది చెబుతున్నారని, మరొకసారి మీడియాతో మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.