అమెరికాలో ఓ తెలుగు విద్యార్థికి ఏడాది జైలు శిక్ష !

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లిన ఓ తెలుగు విద్యార్థికి అక్కడి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. చిత్తూరుకు చెందిన ఆకుతోట విశ్వనాథ్‌ (27) అనే యువకుడు 2015లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. న్యూయార్క్‌లోని సెయింట్ రోస్ కాలేజీలో విశ్వనాథ్ చదువుకుంటున్నాడు. అయితే కాలేజీలోని కంప్యూటర్లను వాడుతున్నప్పుడు విశ్వనాథ్ వాటికి వైరస్ ఉన్న ‘కిల్లర్ యూఎస్ బీ’ని అనుసంధానించాడు.

దీంతో సాంకేతిక సమస్య తలెత్తి 66 కంప్యూటర్లు చెడిపోయాయి. దీన్ని గుర్తించిన నిర్వాహకులు గతేడాది ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విశ్వనాథ్ ను ఫిబ్రవరి 22న అరెస్ట్ చేశారు. ఈ కేసును ఏడాదికి పైగా విచారించిన అమెరికా కోర్టు విశ్వనాథ్ ఉద్దేశపూర్వకంగానే కిల్లర్ యూఎస్ బీ పోర్టుతో కంప్యూటర్లను నాశనం చేశాడని నిర్ధారించింది. ఈ నేరానికి గానూ ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41.68 లక్షల జరిమానా విధించింది.