సాగర్‌ 20 గేట్లు ఎత్తివేత.. అందాలు తిలకించేందుకు పోటెత్తిన పర్యాటకులు

వాస్తవం ప్రతినిధి: శ్రీశైలం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలకళను సంతరించుకుంది. డ్యాంలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. నాగర్జునసాగర్‌ జల అందాలను చూసేందుకు సాగర్‌కు పర్యాటకులు పోటెత్తారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భారీగా తరలివస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. జల దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. పర్యాటకుల తాకిడితో నాగార్జున సాగర్‌ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

ఇన్‌ఫ్లో 8 లక్షల 25 వేల క్యూసెక్కులు ఉండగా.. రెండున్నర లక్షల క్యూసెక్కులు ఔట్‌ ఫ్లోగా ఉంది. ప్రస్తుతం 20 గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి కిందకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా పులిచింతలకు చేరుతోంది.

సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 550 అడుగులకు చేరింది. మరో 87 టీఎంసీలు నీరొస్తే.. ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ప్రస్తుతమన్న ఫ్లో కొనసాగితే రోజుకు 55 టీఎంసీల వరకూ వరద వస్తోంది కాబట్టి.. రేపటి కల్లా పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ గేట్లు ఒక్కొక్కటిగా తెరుస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుకు 26 గేట్లుంటే ఉదయం ఏడున్నరకు నాలుగుగేట్లు తెరిచారు. ఇప్పుడు ఏకంగా 20 గేట్లు తెరిచారు.