తనపై మీడియాలో వస్తున్న వార్తల పై క్లారిటీ ఇచ్చిన బొండా ఉమా..!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఆ పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు ఇప్పటికే బీజేపీ పార్టీలో చేరి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి టెన్షన్ పెట్టారు. కేవలం జరిగిన ఎన్నికలలో 23 శాసనసభ స్థానాలను 3 పార్లమెంటు స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో అధికార పార్టీ వైసీపీ పార్టీ దూకుడుకు కళ్లెం వేయలేకపోతుంది. ముఖ్యంగా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు జగన్ దూకుడు కి బెంబేలెత్తిపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో బెజవాడ రాజకీయ నేత తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ పార్టీ మారుతున్నట్లు వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే బోండా ఉమ స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు బోండా ఉమ కొట్టిపారేశారు. ఎట్టిపరిస్థితుల్లో టీడీపీని వీడేది లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కాగా, పార్టీ మారుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆయనతో చర్చలు జరిపారు. తాజాగా చంద్రబాబుతో కూడా బొండా భేటీ అయ్యారు. మొత్తం మీద బోండా ఉమా తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని ఎప్పటికీ తన రాజకీయ ప్రయాణం చంద్రబాబుతోనే అన్నట్టుగా క్లారిటీ ఇచ్చారు.