గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల గురించి జగన్ పై విమర్శలు చేసిన లోకేష్..!

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయాలు పేరిట జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే జగన్ హయాంలో వస్తున్న ఈ ఉద్యోగాల విషయంలో అవినీతి జరుగుతోందని,పెద్ద స్కాం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. ట్విట్టర్ లో ఇటీవల నారా లోకేష్ మాట్లాడుతూ సంచలనాత్మక కామెంట్స్ చేశారు. అంతేగాక సీఎం జగన్‌ను స్కామ్ స్టార్‌ అని విమర్శించారు. వాలంటీర్ల స్కీమ్‌ అనేది కుట్రని.. బాగోతం బయటపడిందని.. ఓ వీడియోను పెట్టి ట్వీట్ చేశారు. జగన్ కు ఆస్కార్‌ తప్పకుండా వస్తుందని.. అంతబాగా నటిస్తున్నారని ఘాటుగా ఆరోపణలు కురిపించారు. గ్రామ వాలంటీర్ల స్కామ్‌తో జగన్ రూ.12 కోట్ల ప్రజాధన దోపిడీకి తెరలేపారని ట్వీట్‌లో పేర్కొన్నారు. వాలంటీర్ల నియామకంలో కులం, మతం కన్నా.. వైసీపీ కార్యకర్తా.. లేదా అనేది మాత్రమే చూస్తున్నారని వ్యాఖ్యానించారు లోకేష్.