మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న విరాట్‌ కోహ్లీ

వాస్తవం ప్రతినిధి: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆదివారం ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా విండిస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 59 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కెప్టెన్ విరాట్ కోహ్లీ (120) సెంచరీతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్ (71) హాఫ్ సెంచరీ చేయడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగులు చేసింది. వన్డేల్లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ.

అనంతరం వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు. అయితే, లక్ష్య చేధనలో వెస్టిండిస్ 210 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధించడంతో ఓ సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండిస్ గడ్డపై ఒక వన్డేలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా 16 ఏళ్ల రికార్డుని కోహ్లీ తిరగరాశాడు.