మాజీ క్రికెటర్‌కు రెండు మూడు పదవులుంటే తప్పేంటి?: అనిల్ కుంబ్లే

వాస్తవం ప్రతినిధి: మాజీ క్రికెటర్‌కు రెండు మూడు పదవులుంటే తప్పేంటని టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. పరస్పర విరుద్ధ ప్రయోజన అంశంలో మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్‌ ద్రావిడ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డీకే జైన్‌ నోటీసులు జారీ చేయడంపై అనిల్‌ కుంబ్లే స్పందించాడు. ప్రతి దాంట్లోనూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉంటాయని కుంబ్లే అన్నాడు. ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాల పేరుతో మాజీ ఆటగాళ్లకు నోటిసులిస్తుంటే, ఆటలో వారి భాగస్వామ్యమే లేకుండా పోయే ప్రమాదం ఉందని కుంబ్లే ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే పరస్పర విరుద్ధ ప్రయోజనాలను ఎలా స్వీకరించారన్నది కూడా ముఖ్యమేనని కుంబ్లే అన్నాడు.