శ్రీనగర్ జైల్లో ఉన్న కరుడగట్టిన ఉగ్రవాదుల్ని ప్రత్యేక విమానంలో ఆగ్రా జైలుకు తరలింపు

వాస్తవం ప్రతినిధి: శ్రీనగర్ జైల్లో ఉన్న కరుడగట్టిన ఉగ్రవాదుల్ని.. వేర్పాటువాదుల్ని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు తరలించిన వైనం ఆలస్యంగా బయటకు వచ్చింది. జమ్ముకశ్మీర్ ను ఉగ్రభూతం నుంచి సంపూర్ణ విముక్తి కల్పిస్తానని నరేంద్ర మోడీ జాతికి హామీ ఇచ్చిన తర్వాతే.. ఈ సీక్రెట్ ఆపరేషన్ బయటకు వచ్చింది. కశ్మీర్ లోయలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించే 70 మంది కరడుగట్టిన ఉగ్రవాదులు.. వేర్పాటువాద నేతల్ని ప్రభుత్వం శ్రీనగర్ జైల్లో కొన్నేళ్లుగా ఉంచింది.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 70 మంది ఖైదీల్ని వాయుసేనకు చెందిన ప్రత్యేక హెలికాఫ్టర్ లో శ్రీనగర్ నుంచి ఆగ్రాలోని ఖేరియా ఎయిర్ పోర్ట్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిని జైలుకు తరలించారు. వీరి కోసం జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆగ్రాకు తరలించిన ఖైదీల వివరాలు బయటకు రాలేదు. అంతేకాదు.. రానున్న రోజుల్లో మరికొంతమందిని కూడా ఇదే రీతిలో ఆగ్రాకు తరలిస్తారని చెబుతున్నారు.