విషణ్న వదనాలతో సుష్మ కు నివాళులర్పిస్తున్న ప్రముఖులు

వాస్తవం ప్రతినిధి: బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హఠాన్మరణంతో యావద్దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఘనంగా నివాళులర్పిస్తోంది. తమ ప్రియతమ నేతకు తుది నివాళులర్పించేందుకు పార్టీలకు అతీతంగా ప్రముఖ నేతలంతా ఆమె నివాసానికి ఉదయం నుంచి చేరుకుంటున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఇవాళ ఉదయం సుష్మ నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. సుష్మ స్వరాజ్ కుటుంబీలను ప్రధాని మోదీ, వెంకయ్యనాయుడు ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

సుష్మకు ఉదయం నుంచి నివాళులర్పించిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజ్వాల్, టీఎంసీ ఎంసీ డెరిక్ ఒబ్రెయిన్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బీజేపీ కార్యనిర్వాహక అద్యక్షుడు జేపీ నడ్డా, సమాజ్‌వాదీ పార్టీ అద్యక్షుడు ములాయం సింగ్, యోగాగురువు రాందేవ్ బాబా, బీజేపీ ఎంపీ హేమమాలిని, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, బీఎస్‌పీ చీఫ్ మాయావతి తదితరులు ఉన్నారు. సుష్మాస్వరాజ్‌కు నివాళులర్పిస్తూ సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌ గోపాల్ యాదవ్ కన్నీరుమున్నీరయ్యారు.