ప్రభుత్వం, సాయుధ సంస్థల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో బాలలు బలైపోతున్నారు: ఆంటోనియో గుటెరస్

వాస్తవం ప్రతినిధి: భారత్‌లో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తాయిబా వంటి ఉగ్రవాద సంస్థలతోపాటు నక్సలైట్లు తమ సంస్థల్లో పిల్లలను చేర్చుకోవడంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలు పిల్లలను రిక్రూట్ చేసుకుంటున్నట్లు తమకు నివేదికలు వస్తున్నాయని చెప్పారు. 14 ఏండ్లలోపున్న ఐదుగురు బాలలను హిజ్బుల్ ముజాహిదీన్ (ఇద్దరు), అన్సర్ ఘజ్వత్ ఉల్ హింద్ (ఒకరు), లష్కరే తాయిదా(ఇద్దరు) సంస్థలు నియమించుకున్నట్లు నివేదికలు అందాయని పేర్కొన్నారు. అలాగే మావోయిస్టులు వ్యవస్థీకృతంగా పిల్లలను నియమించుకోవడం కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఎనిమిదేండ్ల బాలికపై దారుణంగా లైంగికదాడి జరిపి హత్య చేసిన ఘటనను కూడా నివేదికలో ప్రస్తావించారు.

నేరగాళ్లను చట్టం ముందు నిలబెట్టాలని భారత ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు పిల్లలు, సాయుధ ఘర్షణలపై ప్రధాన కార్యదర్శి వార్షిక నివేదిక పేరిట 2018 ఏడాదిగానూ రూపొందించిన నివేదికను విడుదల చేశారు. ప్రభుత్వం, సాయుధ సంస్థల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో బాలలు బలైపోతున్నారని గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు.