అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మరో కీలక నిర్ణయం!

వాస్తవం ప్రతినిధి: అంపైర్ల తప్పిదాలను మరింత తగ్గించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి నుంచి నోబాల్‌ను పర్యవేక్షించే బాధ్యత థర్డ్‌ అంపైర్‌కు కూడా అప్పగించనుంది. దీంతో ఫ్రంట్ ఫుట్‌ నోబాల్‌ను గుర్తించడంలో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లతో పాటు థర్డ్‌ అంపైర్లు కూడా బాధ్యత నిర్వహించనున్నారు. అంతకుముందు సమీక్ష కోరినప్పుడు మాత్రమే థర్డ్‌ అంపైర్‌ నోబాల్‌ను పరిశీలించేవారు. బీసీసీఐ అభ్యర్థన మేరకు ఈ నిబంధనను ఐసీసీ అమలుచేయనుంది. దీన్ని ముందుగా భారత్‌లో జరిగే దేశవాళీ క్రికెట్‌లో పరీక్షించనున్నారు. ఇది విజయవంతమైన తర్వాత అంతర్జాతీయ మ్యాచుల్లో ప్రవేశపెడతారు. అయితే ఇది సాంకేతిక పరంగా ఖర్చుతో కూడిన పని కావడంతో ఐసీసీ వెనకడగు వేయవచ్చని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.