తండ్రి ని తలపిస్తున్న వైఎస్ జగన్ పరిపాలన..!

వాస్తవం ప్రతినిధి: వైయస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అంత పేరు రావటానికి గల కారణాలలో ముఖ్య కారణం ఆరోగ్యశ్రీ పథకం. తన పరిపాలనా సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు ప్రజలకు దేవుడు అయిపోయాడు. అయితే తాజాగా ఇటీవల విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు వైయస్ జగన్ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి తన తండ్రి పాలన తపించే విధంగా పథకాలు ప్రవేశ పెడుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ సేవలను ఆగస్టు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారందరికీ ఉచితంగా ఈ పథకం ద్వారా వైద్యసేవలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేర‌కు జ‌గ‌న్ సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఆరోగ్య‌శ్రీ‌లో ఎలాంటి తేడాలు జ‌ర‌గ‌కుండా పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని సిఎం వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. అందుకుగాను నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.450 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. ఇటీవల కలెక్టర్ల సదస్సు అనంతరం వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే అమలు చేయాల్సిన అంశాలపై అధికారులకు సిఎం పలు సూచనలు చేశారు. నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ గుర్తింపు పొందేలా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రుల్లో తగిన మౌలిక వసతులు, మానవ వనరులు ఏర్పాటు చేయాలని.. ఆ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య సంస్థలు, ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని సీఎం ఆదేశించారు.