బిగ్ బాస్ షో కి షాకిచ్చిన బిజెపి..!

వాస్తవం ప్రతినిధి: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతగానో ఆశగా ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం మొదలయ్యింది. అయితే ఈ షో కి రెండు తెలుగు రాష్ట్రాలలో వస్తున్న ఆదరణ చూసి బిజెపి పార్టీ బిగ్ బాస్ షో పై షాకింగ్ కామెంట్ చేసింది. తాజాగా ఇటీవల 15 మంది సభ్యులతో మొదలైన బిగ్ బాస్ షో పై ఆంధ్ర రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్ చేశారు. షో మొదలవక ముందు వరకు జరిగిన వివాదాలు ఒక ఎత్తు అయితే..షో మొదలయ్యాక బిజెపి పార్టీ చేస్తున్న విమర్శలు మరొక ఎత్తులా ఉన్నాయి. విషయంలోకి వెళితే బిజెపి పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ..సోషల్ మీడియాలో “బిగ్ బాస్-సీరీస్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ షో భారతీయ సంప్రదాయాలకు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించి యువతను పక్కదారి పట్టించేలా ఉంది.తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ షో ప్రసారం కాకుండా పర్మిషన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను”. అంటూ ఆంధ్ర,తెలంగాణ సీఎం లకి ట్విట్టర్ లో టాగ్ చేశాడు కన్నా. దీంతో కన్నా లక్ష్మీనారాయణ పై సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్ మీద కౌంటర్ లు వేస్తున్నారు. ఇలాంటి షో వలన సంస్కృతి సాంప్రదాయాలకు భంగం ఎందుకు వాటిల్లుతుందని…గతంలో బిజెపి పార్టీ హయాంలో బిగ్ బాస్ షో ప్రసారం అయింది అప్పుడు ఎందుకు రియాక్ట్ అవలేదు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు. ఈ షో ని అడ్డం పెట్టుకుని ప్రజల మనోభావాలతో ఆడుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నారా..?అంటూ బీజేపీ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.