చంద్రయాన్-2: భారత్ ఈ ప్రయోగం ద్వారా సాధించేదేమిటి?

వాస్తవం ప్రతినిధి: జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగిస్తుంది. ఈ ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకు?

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ అంతరిక్ష నౌక నింగికి దూసుకెళుతుంది. సెప్టెంబర్ 6-7 తేదీల నాటికి అది చంద్రుడిని చేరుతుంది. చంద్రుడి మీద సురక్షితంగా దిగటం (సాఫ్ట్‌ల్యాండింగ్) లక్ష్యంగా ప్రయోగిస్తున్న అంతరిక్ష వాహనం చంద్రయాన్-2. సాఫ్ట్‌ల్యాండింగ్ అంటే.. ఏదైనా గ్రహం లేదా అంతరిక్షంలోని గ్రహ శకలం ఉపరితలం మీద దిగే వాహనం ఏమాత్రం దెబ్బతినదు. చంద్రయాన్-2 విజయవంతమైతే.. చంద్రుడి ఉపరితలం మీద అంతరిక్ష వాహనాన్ని సాఫ్ట్‌ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. అంతేకాదు..

చంద్రయాన్-2 చంద్రుడి నుంచి చాలా చాలా సమాచారం కూడా భూమికి పంపిస్తుంది. ఎలా? చంద్రయాన్-2లో మూడు ముఖ్యమైన పరికరాలు ఉన్నాయి. మొదటిది ఆర్బిటర్. ఇది చంద్రుడి కక్ష్యలో చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. మరొకటి ల్యాండర్. ఇది చంద్రుడి ఉపరితలం మీద దిగుతుంది. అలా దిగిన తర్వాత ఈ ల్యాండర్ రోవర్ అనే మూడో పరికరాన్ని బయటకు పంపుతుంది. అది చంద్రుడి మీద అన్వేషణ చేస్తుంది. ఈ రోవర్ తను గుర్తించిన సమాచారాన్ని ల్యాండర్‌కు పంపిస్తుంది. ల్యాండర్ ఆ సమాచారాన్ని ఆర్బిటర్‌కు చేరవేస్తుంది. ఆర్బిటర్ దానినంతటినీ భూమికి పంపిస్తుంది. ఈ అంతరిక్ష నౌకలో భారతదేశం 13 పరిశోధన పరికరాలు అమర్చింది. ఇవికాక.. నాసా పంపించిన మరొక పరికరాన్ని కూడా ఇది మోసుకెళుతుంది.. ఉచితంగా. ఈ పరికరాలు చంద్రుడి దక్షిణ ధృవానికి అతి సమీపంగా వెళ్లనున్నాయి. ఇంతకుముందు చంద్రుడి మీద దిగిన మిషన్లన్నీ.. చంద్రుడి మధ్య రేఖ మీద దిగాయి. ఏ అంతరిక్ష నౌక కూడా చంద్రుడి ధృవం సమీపంలో దిగలేదు. కాబట్టి చంద్రయాన్-2 ద్వారా కొంత కొత్త సమాచారం లభిస్తుందని ఆశిస్తున్నారు.

భారత్ గతంలో చంద్రుడి పైకి చేసిన చంద్రయాన్-1 ప్రయోగం విజయంతమైంది. భారతదేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన మొదటి అంతరిక్ష వాహనం అది. అతి తక్కువ వ్యయంతో ఈ మిషన్‌ను విజయవంతం చేయటం అంతర్జాతీయంగా గుర్తింపు సాధించింది. ఆ కార్యక్రమానికి భారత్ సారథ్యం వహించగా.. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, బ్రిటన్‌లు కూడా అందులో పాలుపంచుకున్నాయి. నిజానికి చంద్రయాన్-1ను రెండేళ్లు పనిచేసేలా రూపొందించారు. కానీ పది నెలల తర్వాత అందులో పరికరాలు విఫలమయ్యాయి.

అయితే అప్పటికే చంద్రుడి మీద నీటి అణువుల జాడను పసిగట్టటం ద్వారా చంద్రయాన్-1 చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-1కి కొనసాగింపుగా చంద్రయాన్-2ను ప్రయోగిస్తోంది ఇస్రో.

భారతదేశ జాతీయ పతాకాన్ని ఈ అంతరిక్ష నౌక చంద్రుడి మీదకు తీసుకెళుతోంది. దీంతో ఇది జాతీయ గౌరవానికి సంబంధించిన అంశంగా కూడా మారింది. అంగారక గ్రహం మీద, ఆస్టరాయిడ్ల మీద సాఫ్ట్ ల్యాండింగ్‌ ప్రయోగానికి.. చంద్రుడి మీదకు మనిషిని పంపించటానికి కూడా తాజా ప్రయోగం తలుపులు తెరుస్తుంది. భారతదేశం సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరకుంటున్న అతి ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానమిది.

కానీ ఇది అంత సులభం కాదు. ఇది రాకెట్ సైన్స్. భూమి నుంచి చంద్రుడికి మధ్య ఉన్న దూరం 3.84 లక్షల కిలోమీటర్లు. చంద్రుడి మీద గురుత్వాకర్షణ లేదు. వాతావరణమూ లేదు. భారత్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేస్తున్న మొట్టమొదటి ప్రయత్నమిది. ఉపరితలం మీద దిగటానికి ప్యారాచూట్ ఉపయోగించటానికి వీలులేదు. కాబట్టి సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చాలా కష్టమైన పని. గతంలో ఇందుకోసం చేసిన ప్రయోగాల్లో సగం విఫలమయ్యాయి. అంతా కంప్యూటర్ల నియంత్రణలో ఉంటుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయిన తర్వాత 15 నిమిషాలు అత్యంత కీలకం.

ఈ ప్రాజెక్టు చాలాసార్లు వాయిదా పడింది. చంద్రయాన్-1 ప్రయోగించినపుడు.. 2014లో చంద్రయాన్-2ను ప్రయోగించాలని నిర్ణయించారు. అప్పుడు రష్యా కూడా జతకలిసింది. చంద్రుడి మీద దిగే ల్యాండర్‌ను ఆ దేశం అందిస్తుందని అనుకున్నారు. కానీ.. రష్యా అంతరిక్ష కార్యక్రమంలో పలు సమస్యలు తలెత్తటంతో అలా జరగలేదు. దీంతో భారత్ సొంతంగా ల్యాండర్‌ను తయారుచేయాలని నిర్ణయించుకుంది. అందువల్లనే ఇంత ఆలస్యమైంది. పేలోడ్’ అనే మాట మీరు విని ఉంటారు. ఆ మాటకు అర్థం.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లు తీసుకెళ్లే శాస్త్రీయ పరికరాలు. ఆర్బిటర్‌లో హై క్వాలిటీ కెమెరా ఒకటి ఉంది. చంద్రుడి మీది పలుచటి వాతావరణాన్ని విశ్లేషించే ఒక పరికరం కూడా ఉంది. భూకంపాల మాదిరిగానే చంద్రుడి మీద కూడా చంద్రకంపాలు వస్తుంటాయి. కాబట్టి దానిని కూడా విశ్లేషించటం జరుగుతంది. ప్రోబ్ తరహా పరికరం కూడా ఒకటి ఉంటుంది. దానిని చంద్రుడి ఉపరితలం కిందికి పంపిస్తారు. దానిద్వారా చంద్రుడి మీద ఉష్ణోగ్రతల గురించి తెలుసుకోవచ్చు.

ఇక చంద్రుడి మీద మట్టి గురించి చెప్పే మరొక పరికరం కూడా ఉంటుంది. భారత అంతరిక్ష ప్రయోగాలకు దేశంలో యూపీఏ అయినా, ఎన్‌డీఏ అయినా ప్రతి ప్రభుత్వం మద్దతు ఇస్తోందని.. కాబట్టే ఇండియా దగ్గర అంత ఎక్కువ సంఖ్యలో రాకెట్లు ఉన్నాయని ప్రముఖ సైన్స్ జర్నలిస్ట్ పల్లవ్ బాగ్లా చెప్తారు. అంతేకాదు.. ఈ మిషన్‌కు మరో ప్రాధాన్యత కూడా ఉంది. ఇద్దరు మహిళలు – మిషన్ డైరెక్టర్ రితూ కారిధాల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్యలు ఈ మిషన్‌కు సారథ్యం వహిస్తున్నారు.

……. సురేష్ కరోతు