టి‌ఆర్‌ఎస్ ఎందుకు ఇలా చేస్తోంది..?

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో తన హవా చాటిన టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలలో కొద్దిగా నిరాశ పరిచింది. దీంతో టిఆర్ఎస్ పార్టీ త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలకు సన్నద్ధం అవటానికి రకరకాల జిమ్మిక్కులు సోషల్ మీడియా ద్వారా చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా సామాన్యులను ఎంతగా ప్రభావితం చేస్తుందో మనకందరికీ తెలిసినదే. ప్రతి రాజకీయ పార్టీకి మరియు అలాగే వివిధ సంస్థలకు సోషల్ మీడియాలో తమకంటూ సంబంధించిన వెబ్ సైట్లు అలాగే వీడియో చానల్స్ ఉంటున్న సందర్భాలు మనకందరికీ తెలిసినదే. సోషల్ మీడియా ని ఆధారం చేసుకుని ఒక పార్టీకి చెందిన మరొక పార్టీ వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడుతున్న బిజెపి పార్టీ సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీపై బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ బీజేపీ ని సమర్థవంతంగా సోషల్ మీడియాలో ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి 200 మంది కార్యకర్తల చొప్పున సోషల్ మీడియా బృందంగా ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి తమ ప్రత్యర్థులు చేసే దాడిని తిప్పికొట్టడంతో పాటు ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని తెలిసే విధాల వివిధ కార్యక్రమాలు చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీ ఈ విధమైన ఆలోచనతో అడుగుపెట్టడంతో తెలంగాణ రాజకీయాలలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు టిఆర్ఎస్ పార్టీ నిజంగా రాష్ట్రంలో అభివృద్ధి చేస్తే సోషల్ మీడియా కూడా అవసరం లేదని మరి ఎందుకు ఇలా చేస్తుందని…వారి పాలన పై వారికి నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నారు.