జగన్ తో వల్లభనేని భేటీ ?

వాస్తవం ప్రతినిధి: ఇటీవల బీజేపీ పార్టీ పెద్దలతో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయిన సందర్భంలో వంశీ బీజేపీ పార్టీలో చేరుతారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వంశీ వైసీపీ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ తో భేటీ అయినట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వార్తలు వినబడుతున్నాయి. ఇంతకీ విషయం లోకి వెళ్తే ఇటీవల పోలవరం కుడి కాలువ కు సంబంధించి, రైతు సమస్యలు ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ కి వంశీ లేఖ రాయడం జరిగింది..అయితే రాసిన లేఖకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో..నేరుగానే జగన్ తో వంశీ భేటీ అయ్యారు. దీంతో వీరిద్దరి కలయిక ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇదే క్రమంలో వల్లభనేని వంశీ తన నియోజకవర్గ ప్రజలకు సంబంధించి తాగు సాగు నీటి సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా పోలవరం కుడి కాల్వ ద్వారా తన నియోజకవర్గ రైతులకు సాగు నీరందించేందుకు ఏర్పాటు చేసిన 500 మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని జగన్ ను అభ్యర్థించిన వంశీ… ఆ దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే… తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన సదరు 500 మోటార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు జగన్ కు చెప్పారట. దీంతో వంశీ చెప్పిన సమస్యలన్నింటి పై జగన్ సానుకూలంగా స్పందించడంతో…అలానే వల్లభనేని సొంతంగా ఏర్పాటుచేసిన ఐదువందల మోటార్లకు ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇవ్వడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ – వల్లభనేని వంశీల భేటీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.