జగన్ మీద అలిగిన మంత్రి .. ఇప్పుడెలా మరి ?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా ముఖ్యమంత్రి అయిన జగన్ ఒక పద్ధతి పరంగా మీడియా ముందు మరియు అధికారుల ముందు వ్యవహరిస్తుంటే మరోపక్క పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు వ్యవహరిస్తున్న వ్యవహారం జగన్ కి అసహనం కలిగించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసిపి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ సీఎం జగన్ నిర్వహించిన సీఆర్డీఏ కీలకమైన కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఇప్పుడు వైసీపీ పార్టీలో ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. పురపాలక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో కేవలం ముఖ్యమంత్రి సమక్షంలో ఈ సమావేశానికి సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జగన్ అధికారులను ఆరా తీశారు. గత సమీక్షలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అయితే ఇప్పుడు పాల్గొనకపోవడమే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించి మంత్రి బొత్స చేస్తున్న ప్రకటనలు జగన్ కు అస్సలు నచ్చడంలేదట.ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బొత్స అమరావతి ఆగదని, నిర్మాణాలు కొనసాగుతాయని పదే పదే చెబుతూ ఉండడం ఒక కారణమట. ఇదే విషయమై జగన్ ఓ సారి బొత్సను పిలిపించి క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో రాజకీయాలలో జగన్ తండ్రితో సన్నిహితంగా ఉంటూ ఆయన హయాంలో మంత్రిగా పని చేసిన తన పట్ల జగన్ ఇలా వ్యవహరించడంతో తీవ్ర మనస్తాపానికి బొత్స సత్యనారాయణ గురైనట్లు వైసీపీ పార్టీలో వినబడుతున్న టాక్. మరి జగన్ బొత్స సత్యనారాయణ వ్యవహారంపై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.