సెమీఫైనల్ లో భారత్ ఆటతీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కోహ్లీ

వాస్తవం ప్రతినిధి: తన కెప్టెన్సీలో భారత్ కు మరో ప్రపంచకప్ అందించాలని తపించిన విరాట్ కోహ్లీ ఆశలు నేరవేరలేదు. సెమీఫైనల్ లో భారత్ ఆటతీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. తమ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కీలక వికెట్లను చేజార్చుకోవడం ఓటమిపై ప్రభావం చూపిందని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లి.. ‘‘మంగళవారం మ్యాచ్ మా చేతుల్లో ఉంది.. బుధవారం మ్యాచ్ మళ్లీ మొదలైన తరువాత కూడా న్యూజిలాండ్ ను భారీ పరుగులు చేయకుండా కట్టడి చేశాం. న్యూజిలాండ్ ఇచ్చిన టార్గెట్ ఏమీ ఎక్కువ కాదు. అయినా.. మ్యాచ్ ఓడిపోయాం. చేజేతులా చేసుకున్నాం. ఈ వరల్డ్ కప్ లో బాగా ఆడాం. కానీ.. నాకౌట్ సమరంలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయాం. న్యూజిలాండ్ బౌలింగ్ యూనిట్ మాపై మొదట్నుంచీ ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యింది.ఈ మ్యాచ్ లో విజయం క్రెడిట్ అంతా కివీ బౌలర్లదే. మేము టోర్నీ అంతా ఆకట్టుకున్నా కేవలం 45 నిమిషాల పాటు చెత్తగా ఆడటం వల్లే నిష్ర్కమించాం’’ అని కోహ్లీ తెగ బాధపడ్డాడు.