భారమైన హృదయంతో మైదానాన్ని వీడిన ధోనీ

వాస్తవం ప్రతినిధి: టఫ్‌ సిట్యుయేషన్స్‌లోనూ చెక్కు చెదరని ఆటగాడు ధోనీ. ఎంతటి క్లిష్ట పరిస్థితులున్నా.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ముఖంలో ఎటువంటి భావోద్వేగాలు ప్రదర్శించడు ఈ జార్ఖండ్‌ డైనమైట్‌. ఓటమి అంచున ఉన్నా.. కీలక మ్యాచ్‌ చేజారుతున్నా.. ప్రశాంతంగా ఉండడం ధోనీ స్పెషల్‌. గెలిచినా.. ఓడినా ఒకేలా ఉండడం ధోనీకి తప్ప మరెవరికీ సాధ్యం కాదని ఎంతో మంది లెజెండరీ క్రికెటర్లు సైతం అభినందించిన వారే. అటువంటి ధోనీ నిన్న జరిగిన వరల్డ్‌కప్‌ సెమీస్‌ మ్యాచ్‌లో ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. జట్టును గెలిపించాలనుకున్న తరుణంలో రనౌటై వెనుదిరగడంతో ధోనీ తీవ్రంగా బాధ పడ్డాడు. పెవిలియన్‌కు చేరుతున్న సమయంలో దాదాపు ఏడుస్తున్న స్థితిలో కనిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై చెప్పబోతున్నాడని, ఇదే తన చివరి మ్యాచ్‌ అని భావిస్తున్న వేళ ఈ దిగ్గజ క్రికెటర్ భారమైన హృదయంతో మైదానాన్ని వీడడం అభిమానులను సైతం కలచివేసింది.