ఉత్తమ్ పరిస్తితి ఏంటి ??

వాస్తవం ప్రతినిధి: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి చెందడంతో అలాగే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడటంతో టీపీసీసీ చీఫ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి తెలంగాణ రాజకీయాల్లో రకరకాల వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారి పోటానికి గల ముఖ్య కారణం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చాలా మంది సొంత పార్టీ నేతలే కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి చెందడంతో..ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందని దాదాపుగా టీ కాంగ్ నేతలంతా ఆయనకు సూచిస్తున్నారు. కొందరు బహిరంగంగానే ఉత్తమ్ తప్పుకోవాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నా… మరికొందరు ఆయనకు ఎలాగోలా తమ సూచనను చేరవేస్తున్నారు. అయితే ఎందరు ఎన్ని విధాలుగా తనను పదవి నుంచి తప్పుకోమని చెబుతున్నా… ఉత్తమ్ మాత్రం అవేవీ తన చెవికి చేరలేదన్న దిశగానే సాగుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో మాదిరిగానే పార్టీలో కొనసాగటానికి నిశ్చయించుకున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది.