చంద్రబాబు బెంగ అంతా వాళ్ళ మీదే !

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పటంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్లాలో అన్న డైలమాలో పడిపోయారు. ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులు బిజెపి పార్టీలో చేరిన క్రమంలో..తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఎమ్మెల్యేలు మరియు ఇతర నేతల గురించి పెద్దగా భయపడటం లేదు కానీ..తెలుగుదేశం పార్టీకి చెందిన ద్వితీయ క్యాడర్ పై బాబు గారు బాగా బెంగ పెట్టుకున్నట్టు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ నియోజవకర్గాల వారీగా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు వల వేసే పనిలో పడ్డారు. అయితే స్థానిక నేతలకు జగన్ పెట్టే షరతులు వర్తించవు. ఎందుకంటే వారు పార్టీ సభ్యత్వాన్ని వదులుకుని వస్తే సరిపోతోంది..ఇప్పటికే అనేక చోట్ల ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీలో చేరిపోతున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ఇది తమకు ఎక్కడ చేటు తెస్తుందో అన్న ఆందోళన బాబు లో కనిపిస్తోంది. ఇందుమూలంగానే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఒక తాటిపైకి తీసుకురావటానికి పార్టీని కాపాడుకోవడానికి ఓదార్పు యాత్రకు చంద్రబాబు శ్రీకారం చుట్టినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.