పాక్ ప్రధానిగా కొనసాగే అర్హత ఇమ్రాన్ ఖాన్ కు ఎంతమాత్రం లేదు: మర్యమ్ నవాజ్

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పాక్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మర్యమ్ నవాజ్ తీవ్రంగా మండిపడ్డారు. పాక్ ప్రధానిగా కొనసాగే అర్హత ఇమ్రాన్ ఖాన్ కు ఎంతమాత్రం లేదనీ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇమ్రాన్.. ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయ్. ఇంటికి వెళ్లిపో’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ పంజాబ్ లోని మండి బహౌద్దీన్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో మర్యమ్ మాట్లాడుతూ..‘నా తండ్రి నవాజ్ షరీఫ్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆయన్ను జైలులో ఉంచారు. ఇది నేరం. ఆయన త్వరలోనే విడుదల అవుతారు. మళ్లీ ప్రధాని కూడా అవుతారు. అయితే ఈ సారి గతంలో కంటే బలంగా నిలబడతారు. కొన్ని అదృశ్య హస్తాల ఒత్తిడితోనే నా తండ్రిని దోషిగా నిర్ధారించి జైలులో బంధించారు’ అని మర్యమ్ ఆరోపించారు.