ఐఎంఎఫ్ సలహాలను అక్షరాలా అమల్లో పెడుతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

వాస్తవం ప్రతినిధి: సాధారణంగా దేశాధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు విలాసవంతమైన హోటళ్లలో బసచేయడం పరిపాటి. కానీ, పాకిస్థాన్ పరిస్థితి వేరు. ఆర్థికంగా బాగా క్షీణించిన ఆ దేశానికి ఇటీవలే సాయం ప్రకటించిన ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి), ఖర్చులు తగ్గించుకోవాలంటూ పలు సూచనలు కూడా చేసింది. ఆడంబరాలకు పోకుండా ఒద్దికగా ఉండాలని హితవు పలికింది. ఐఎంఎఫ్ సలహాలను పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అక్షరాలా అమల్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు.

త్వరలో అమెరికా పర్యటనకు వెళుతున్న ఇమ్రాన్ అక్కడ ఖరీదైన స్టార్ హోటల్లో బసచేయడానికి బదులుగా, వాషింగ్టన్ లోని ఓ పాక్ దౌత్యాధికారి నివాసంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగైతే ఖర్చులు భారీగా తగ్గుతాయని, నిరాడంబరంగా ఉన్నట్టుంటుందని ఇమ్రాన్ భావిస్తున్నారు. పైగా, ఐఎంఎఫ్ ను సంతృప్తి పరిచినట్టుగా కూడా ఉంటుందని పాక్ ప్రధాని యోచన. జూలై 21 నుంచి ఇమ్రాన్ అమెరికాలో పర్యటిస్తుండగా, దౌత్యాధికారుల నివాస ప్రాంగణంలో బసకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి.