తానా నూతన అధ్యక్షుడుగా జై తాళ్లూరి ఎన్నిక

వాస్తవం ప్రతినిధి:  అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో మూడు రోజులపా టు అంగరంగ వైభోగంగా సాగిన తానా 22వ మహాసభలు స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం సంగీత విభావరితో ముగిశాయి. తానా అధ్యక్షుడు వేమన సతీశ్‌ పద వీ కాలం ముగిసింది. తదుపరి అధ్యక్షుడిగా  తానా మహాసభల వేదికగా కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టారు. సతీష్ వేమన రెండేళ్ల కాలం పూర్తి కావడంతో.. జై తాళ్లూరిని నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. దీంతో జై తాళ్లూరి బాధ్యతలు చేపట్టారు. తానా 22వ మహాసభలు దిగ్విజయంగా జరిగినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు సతీష్ వేమన. గత 17 యేళ్లుగా తాను తానా అభివృద్ధి కోసం కృషి చేశానని ఆయన చెప్పారు. తానాలో ఎలాంటి రాజకీయాలు, వివాదాలకు తావు లేకుండా చేసినందుకు చాలా ఆనందంగా ఉందని సతీష్ వేమన తెలిపారు.

ప్రపంచంలో కెల్లా పెద్ద కన్వెన్షన్‌లో వేడుకలు జరపడం తెలుగువారికే గర్వకారణమని చెప్పారు సతీష్ వేమన. క్రికెటర్ కపిల్ దేవ్‌కు తన చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు ఖ్యాతిని చాటి చెప్పేలా తానా 22వ మహాసభలను ఘనంగా నిర్వహించినందుకు సతీష్ వేమనను తానా సభ్యులు సన్మానించారు. అనంతరం జై తాళ్లూరి నూతన ప్రెసిడెంట్‌గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జై తాళ్లూరి దంపతులను పండితులు ఆశీర్వదించారు.