అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం

వాస్తవం ప్రతినిధి: అమెరికా లో కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతిచెందాడు. వివరాల ప్రకారం..

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి నూనె వీరస్వామి కుమారుడు సురేష్‌(41) డల్లాస్‌ (అమెరికా)లోని సింటెల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. సెలవులు సరదాగా గడిపేందుకు భార్య అనిశెట్టి రూప, కుమార్తె అక్షయ, కుమారుడు సాయితో కలిసి సమీపంలోని ఒక్లహామ్‌ టర్నర్‌ జలపాతానికి శుక్రవారం వెళ్లారు. నీటిలో నుంచి పిల్లలతో బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కాలుజారి జలపాతంలో పడిన సురేష్‌ కనిపించకుండా పోయాడు. దాదాపు రెండు గంటల పాటు గాలించిన సహాయక బృందం చివరకు ఆయన మృతదేహాన్ని వెలికితీసింది.

కాగా, సురేష్‌ భౌతికకాయాన్ని ఒంగోలు తెచ్చేందుకు వారం రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసి ఒంగోలులో ఉన్న సురేష్‌ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.