సామాజక కార్యకర్త ముగిలన్‌ ను అరెస్ట్ చేసిన పోలీసులు

వాస్తవం ప్రతినిధి: తమిళనాడు రాష్ట్రం తుత్తుకూడి స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన సామాజక కార్యకర్త ముగిలన్‌ను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాసిన గడ్డంతో గుర్తుపట్టలేని విధంగా తిరుపతి రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగిలన్‌ను అరెస్ట్ చేసి తమిళనాడు కాట్పాడి పోలీసులకు అప్పగించారు. ముగిలన్ గత ఆరు నెలల క్రితం అదృశ్యమయ్యడు. ఈయన కనిపించకపోవడంతో ఆయన భార్య మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసింది.

ముగిలన్‌కు సామాజిక కార్యకర్తగా, విప్లవ రచయితగా పేరుపొందారు. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేయడంతో అవి హింసకు దారితీసాయి. ఈ నేపధ్యంలో ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అప్పుడు జరిగిన గొడవల్లో పోలీసు కాల్పుల తర్వాత ముగిలన్ అదృశ్యం కావడం కలకలం రేపింది. అప్పటినుంచి పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. శనివారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో ముగిలన్ అరెస్ట్ కావడంతో తమిళ పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.