ఆ అపజయం నాకు మరింత బలాన్ని ఇచ్చింది: తానా వేడుకల్లో పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: పాలకులు భయపెట్టి పాలిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. వాషింగ్టన్ డీసీ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతున్న తానా వేడుకల్లో జనసేనాని పాల్గొన్నారు. విదేశాల్లో జరిగే తెలుగు మహాసభలకు ఎప్పుడూ దూరంగా ఉండే పవన్.. ఈసారి తానా సభలకు హాజరై న్యూ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకెళ్లి వచ్చిన వ్యక్తులే.. ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నప్పుడు.. ఏ తప్పూ చేయని తాను ఎందుకు బాధపడాలని పరోక్షంగా విమర్శించారు. జనసేన ఓటమి తర్వాత.. ఆ పరాజయాన్ని జీర్ణించుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాలే పట్టిందన్న పవన్.. తాను డబ్బు పంచి ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తనకు తెలుసన్న పవన్.. ఆ అపజయం తనకు మరింత బలాన్ని ఇచ్చిందన్నారు. మనుషుల్ని విడగొట్టే రాజకీయాలు చేయనని.. మనుషుల్ని కలిపే రాజకీయాలు చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.