ఈ ఏడాది గాంధీ జయంతి కల్లా రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండకూడదు: జగన్

వాస్తవం ప్రతినిధి: తాను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్, నేడు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఉదయం కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 1 వ తేదీకల్లా రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేయాలని ఆదేశించారు. ఈ విషయమై గతంలో తానిచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకునేది లేదని స్పష్టం చేశారు.

జాతీయ రహదారుల పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వరాదని కూడా జగన్ ఆదేశించారు. ఎటువంటి రహదారి అయినా, దాబాల్లో బ్రాందీ, విస్కీ తదితరాలను విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు వైఎస్ జగన్ సూచించారు. ప్రస్తుతమున్న మద్యం షాపుల లైసెన్స్ పరిమితి ముగియగానే, మరింత కఠినంగా ఉండేలా కొత్త పాలసీని తీసుకువస్తామని, ఈ దిశగా ఎక్సైజ్ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. షాపుల సంఖ్యతో పాటు బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్యను కూడా తగ్గిస్తామని స్పష్టం చేశారు.