ప్రైవేటు స్కూల్ ఫీజుల విషయంలో జగన్ సరికొత్త నిర్ణయం…!

వాస్తవం ప్రతినిధి: తన మొట్ట మొదటి ప్రాధాన్యత ప్రజలకు సరైన ఆరోగ్యం, విద్య అందించడమే అని ఇటీవల కలెక్టర్ల సమావేశంలో అధికారులకు, మంత్రులకు తెలియజేశారు ఏపీ సీఎం జగన్. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్స్ ఫీజుల విషయంలో నియంత్రణ తీసుకురావడానికి రాబోయే శాసనసభలో సరికొత్త చట్టం తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదని జగన్‌ అన్నారు. జనవరి 26 నుంచి‘అమ్మఒడి’చెక్కుల పంపిణీ చేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు తప్పనిసరిగా గుర్తింపు ఉండడంతో పాటు కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో ఉపాధ్యాయులు కూడా ఉండాలని సీఎం అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని జగన్‌ వివరించారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని.. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తామన్నారు. తాజాగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.