జగనే నాకు ఆదర్శం అంటున్న టీ కాంగ్రెస్ నేత…!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మార్చాలని అప్పుడే పార్టీ బాగుపడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానానికి సూచించారు. యుద్ధం చేసే వాడికి కత్తి ఇవ్వకుండా.. ఇంట్లో కూర్చున్నోడికి ఇస్తే ఏమి లాభం అని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అధిష్టానం పై సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందని, రాష్ట్రంలో పార్టీ గట్టిగా ఉండాలంటే టీపీసీసీ పదవిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కాకుండా కొత్త వాళ్లను పెట్టాలని, రాజగోపాల్‌రెడ్డి ముందు నుంచి అంటున్నారని ఆయన చెప్పారు. టీపీసీసీ ఎప్పుడు మారినా సీనియర్‌ నాయకుడిగా ఉన్న తనకే వస్తుందనే నమ్మకం ఉందని వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ వచ్చినా రాకున్నా కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతూ ప్రజా సమస్యలపై ఉద్యమిస్తానన్నారు. తాను వైఎస్‌ రాజశేఖరరెడ్డి శిష్యుడినని, కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని తెలిపారు. ప్రతిపక్షంలో ఉండి వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ ఇద్దరూ పోరాడినట్లు ప్రజా సమస్యలపై తాను అలాగే ఉద్యమిస్తానన్నారు.అధిష్టానం అనుమతితో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, బస్సు యాత్ర చేపడతానని వెల్లడించారు.