ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తిన కిమ్

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జంగ్ ఉన్‌ కు ఓ లేఖ అందింది. ఇక దీన్ని చదివిన కిమ్, ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తారని ఆ దేశ అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. ట్రంప్ నుంచి కిమ్ కు ఓ పర్సనల్ లెటర్ వచ్చిందని, దీన్ని చదివిన తరువాత కిమ్ మాట్లాడుతూ, లేఖలో అద్భుతమైన విషయం ఉందని వ్యాఖ్యానించారని తెలిపింది. ట్రంప్ ధైర్యం అసమాన్యమని కూడా ఆయన అన్నట్టు కేసీఎన్ఏ వెల్లడించింది. కాగా, ఈ లెటర్ కిమ్ కు ఎప్పుడు చేరిందన్న విషయాన్ని మాత్రం వార్తా సంస్థ వెల్లడించలేదు. ఇదే విషయమై, ఈ లేఖ విషయంలో వైట్ హౌస్ కూడా అధికారికంగా స్పందించలేదు. ఇటీవల కిమ్ నుంచి ట్రంప్ కు ఓ లేఖ వెళ్లిన సంగతి తెలిసిందే. కిమ్ మంచి ఉత్తరం రాశారని ట్రంప్ వ్యాఖ్యానించారు కూడా. దానికి ప్రతిగానే ఈ లెటర్ ను ట్రంప్ రాసినట్టు తెలుస్తోంది.