చైనాపై మరో షాకింగ్ నిర్ణయం తీసుకొన్న ట్రంప్ సర్కారు

వాస్తవం ప్రతినిధి: గూఢచర్యం ఆరోపణలతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మేకర్ అయిన హువావేను నిషేధించి చైనాపై వాణిజ్య యుద్ధానికి తెరతీసిన ట్రంప్ సర్కారు ఇప్పుడు మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. చైనా కంపెనీలు, సూపర్ కంప్యూటర్ తయారీలో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పుడు బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని నిర్ణయించింది. అంటే ఆయా సంస్థలేవీ ఇకపై అమెరికా నుంచి విడిభాగాలను కొనుగోలు చేయలేవన్నమాట. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కావాలనుకుంటే మాత్రం ప్రభుత్వ అనుమతి అవసరం.

అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన చైనా కంపెనీల జాబితాలో వుగ్జి జియాంగ్‌నాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటింగ్ టెక్నాలజీ, హిగాన్, చెంగ్డు హైగువాంగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అండ్ చెంగ్డు హైగువాంగ్ మైక్రోఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ తదితర సంస్థలున్నాయి. ఈ సంస్థలు సూపర్ కంప్యూటర్ కోసం మిలటరీ అప్లికేషన్స్ అభివృద్ధి చేస్తుంటాయి. అమెరికా తాజా ఆంక్షలపై వాషింగ్టన్‌లోని చైనా దౌత్యకార్యాలయం ఇప్పటి వరకు స్పందించలేదు.