విరాట్‌ కోహ్లీకి భారీ జరిమానా విధించిన ఐసీసీ

వాస్తవం ప్రతినిధి:టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి ఐసీసీ భారీ జరిమానా విధించింది. నిన్న అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు గానూ మ్యాచ్‌ ఫీజులో 25%కోత విధించారు. ఐసీసీ కోడ్‌లోని ఆర్టికల్‌ 2.1ను ఉల్లంఘించారని ఐసీసీ పేర్కొంది. 29వ ఓవర్లో అఫ్గాన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా రెహ్మత్‌ షా స్ట్రైక్‌లో ఉన్నాడు. టీమిండియా బౌలర్‌ వేసిన బంతి బ్యాట్స్‌మెన్‌ లెగ్స్‌కు తాకిందంటూ టీమిండియా ఆటగాళ్లందరూ అంపైర్‌ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అలీందర్‌ అనే అంపైరుతో కోహ్లీ కొంచెం దూకుడుగా ప్రవర్తించాడు. దీంతో ఐసీసీ కోహ్లీకి జరిమానా విధించింది. ప్రపంచ కప్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్‌పై టీమిండియా 11 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.